ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాల్సిందే
మార్చి 31 డెడ్‌లైన్… పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
ఇసుక, సిమెంట్ చౌకగా అందేలా ప్రత్యేక చర్యలు
హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశాలు
లబ్ధిదారులతో నేరుగా సమావేశం
కరీంనగర్‌లో నిర్మాణాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, కోతి రాంపూర్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని సమగ్రంగా తనిఖీ చేసి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ ఖర్చులు, ఇసుక, ఇటుక, కంకర ధరలు, బిల్లుల చెల్లింపుల పరిస్థితిపై వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయడంతో సొంతింటి కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
బిల్లులు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లింపులు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, ఎక్కడా పెండింగ్‌లో ఉంచవద్దని ఎండి గౌతమ్ అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో ప్రారంభించిన ఇండ్ల తుది పనులు మార్చి 31లోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వారం లేదా పదిరోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, ఇటుక, సిమెంట్ వంటి సామగ్రి చౌకగా లభించేలా డీలర్లతో చర్చించి సమీప క్వారీల నుంచి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధరలు తగ్గితే లబ్ధిదారులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ప్రత్యేక సమీక్ష
తర్వాత కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో సమావేశమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి సంతృప్తికరంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి, సంబంధిత అధికారులను ఎండి గౌతమ్ అభినందించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈఈ నరసింహ చారి, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


