- పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు.
కాకతీయ, పరకాల : పరకాల మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ఇళ్లు మంజూరైన వారు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరకాల మండలంలో ముమ్మరంగా సాగుతోందని అన్నారు. గురువారం మండల పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నిర్మాణం పూర్తి చేసినంత వరకు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మాణ సామగ్రి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తెలపాలని వారికి సూచించారు. ఈ నెల చివరి వరకు సాధ్యమైనంత ఎక్కువగా గృహ ప్రవేశాలు చేయాలన్నారు. మండలంలోని 10 గ్రామాలలో 285 కేటాయించగా ఇప్పటి వరకు వివిధ దశలలో పనులు పూర్తి చేసిన 169 లబ్ధిదారులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


