ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగంపెంచాలి
త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి
మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి
గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం సీతక్క.. మేడారంలోని హరిత హోటల్‌లో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్న వాగు అభివృద్ధి, ఇందిరమ్మ నిర్మాణం, గోదావరి పుష్కరాల నిర్వహణ, వేసవికాలంలో తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పలు అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… జిల్లాలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అన్నారు. పూర్తయిన ఇండ్లకు డబ్బులు చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించే విధంగా గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆదివాసీ పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన సలహాలు మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, మేడారం రహదారుల డివైడర్ మధ్య భాగంలో ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు.
జంపన్న వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం
జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చూడడం కోసం జంపన్న వాగుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం నిపుణులతో సర్వే నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అభివృద్ధిపరచాలని అన్నారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ ల వద్ద ప్రజల సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తుల సౌకర్యార్థం జిల్లాలో నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
ములుగు పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ–3194 యూనియన్ డైరీని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ములుగు జిల్లా జనరల్ ఐఎన్ టియుసి అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు వంగేటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కోరం శ్రీనివాస్, కోశాధికారి చింతమల్ల వినోద్, సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాసరెడ్డి, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.


