ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలి
అధికారులకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు
కాకతీయ,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతి లబ్ధిదారికి కేటాయించిన ఇళ్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ పడకూడదని, నిర్దేశిత గడువులోగా ఇళ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణంలో చురుకుగా పాల్గొని, అందించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ స్థితిని అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో సత్యానంద్, ఇంజనీరింగ్ అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


