మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
స్వయం సహాయక సంఘాల్లో చేరితే మరిన్ని ఆర్థిక లాభాలు
ఏడాదిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తాం
పట్టణాన్ని శుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం : స్వయం సహాయక సంఘాల మహిళలకే పరిమితం కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు డివిజన్‌లో ఆయన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం నాటికి మధిర మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10,272 ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో ఐదు వేల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, మరో ఐదు వేల మంది చేరాల్సిన అవసరం ఉందని చెప్పారు. సంఘాల్లో చేరితే వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు.
డ్రైనేజీ పూర్తైతే పట్టణమే మారుతుంది
మధిరలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏడాది కాలంలో పూర్తవుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. పనుల సమయంలో కొంత అసౌకర్యం కలిగినా, పూర్తయ్యాక శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మరుగుదొడ్ల నుంచి వచ్చే కలుషిత నీటిని పైపుల ద్వారా ట్రీట్మెంట్‌కు పంపే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత పట్టణమంతా కొత్త సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, రేషన్ కార్డుల ఆధారంగా మధిర పట్టణంలోని 22 వార్డుల్లో అర్హులైన మహిళలందరికీ ఇంటింటికీ వెళ్లి చీరలు అందజేస్తామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం పెంపే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, ఇడి ఎస్సి కార్పొరేషన్ ప్రతినిధి నవీన్ బాబు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


