- కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. శుక్రవారం రోజున కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు వెలిచాల రాజేందర్ రావు తన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పదేళ్ల తర్వాత మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు గ్రామ గ్రామానా ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నాయనీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేయడంతో గ్రామ గ్రామానా పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


