ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు నూతన ఆశ్రయం
కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలకు వేగం : సర్పంచ్ చైతన్య
మునిగలవీడు గ్రామంలో లబ్ధిదారుడి ఇంటి స్లాబ్ పనుల ప్రారంభం
కాకతీయ, నెల్లికుదురు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు పేర్కొన్నారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కమిటీ సభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు హామీలు ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అమలవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా పేదలకు గృహ సౌకర్యం కల్పించే ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. సొంత ఇల్లు కల సాకారం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో స్థిరత్వం తీసుకొస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొల్లికొండ నాగరాజు, రాజు యాదవ్, సతీష్ యాదవ్, అనంత రెడ్డి, కొలిపాక వెంకన్న, శ్రీరాం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


