గల్ఫ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. కోట్లు తెచ్చిన లాటరీ టికెట్!
సౌదీలో కేరళ వ్యక్తిని వరించిన అదృష్టం
అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో రూ.61 కోట్ల గెలుపు
15 ఏళ్ల లాటరీ ప్రయత్నానికి దక్కిన ఫలితం
కాకతీయ, నేషనల్ డెస్క్: ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాల్లో భారతీయులకు తిరుగులేని అదృష్టం దక్కుతోంది. తాజాగా మరో భారతీయుడు కోట్లకు కోట్లు తెచ్చిపెట్టే లాటరీని గెలుచుకుని తన జీవితాన్నే మార్చేసుకున్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబిలో నిర్వహించే ప్రసిద్ధ ‘బిగ్ టికెట్’ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.61.37 కోట్లు సొంతం చేసుకున్నాడు.
15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనడం ఆయనకు అలవాటు. ఏదో ఒక రోజు నా టర్న్ కూడా వస్తుంది అనే నమ్మకంతో కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఆ నమ్మకమే చివరకు జాక్‌పాట్ రూపంలో ఫలితమిచ్చింది. నవంబర్ 9న 282824 నంబర్‌తో కొనుగోలు చేసిన టికెట్, సిరీస్ 281 డ్రాలో మొదటి ప్రైజ్‌గా నిలిచింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి శుభవార్త చెప్పగానే రాజన్‌కి నమ్మశక్యం కాలేదు. ఆ తర్వాత అది నిజమే అని తెలియడంతో రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే అంత పెద్ద మొత్తం గెలుచుకున్నప్పటికీ, ఈ ప్రైజ్ మనీని తనకు ఒక్కడికే కాకుండా, తన వెంట పనిచేసే 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటాని రాజన్ ప్రకటించడం అందరినీ ఆకట్టుకుంది. ఇదే డ్రాలో మరో 10 మంది కన్సోలేషన్ బహుమతులుగా తలా 10,000 దిర్హామ్‌లు గెలుచుకున్నారు. వారిలో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. గత సిరీస్ విజేత కూడా మరో భారతీయుడే కావడం గల్ఫ్‌లో ఇండియన్స్ అదృష్టం ఎంత గట్టిగా నడుస్తోందో చూపిస్తోంది. ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో లాటరీలపై భారతీయుల అదృష్టం వరసగా పండుతోంది. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిన వారికి ఈ లాటరీలు లైఫ్‌టైమ్ గిఫ్ట్‌లా మారిపోతున్నాయి. పీవీ రాజన్ కథ కూడా అలాంటిదే!


