కాకతీయ, ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర దేవాలయాన్ని బుధవారం భారత విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. సాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ కె. రెడ్డి, బ్రూనై భారత హై కమిషనర్ రాము అబ్బగాని ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఆహ్వానించి ప్రత్యేకంగా స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ శిల్పకళ, చారిత్రక ప్రాముఖ్యతపై టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరణ ఇచ్చారు. ఆలయ కట్టడ శైలి, శిల్పకళా నైపుణ్యం తమను ఆకట్టుకుందని రాయబారులు పేర్కొన్నారు. కాకతీయుల వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం ప్రపంచ పర్యాటకులకు గర్వకారణమని వారు అభినందించారు. ఈ సందర్శనలో జిల్లా రాహుల్ శర్మ, తహసిల్దార్ గిరిబాబు, ఘనపురం తహసిల్దార్ సత్యనారాయణ, ఆర్‌ఐ విజేందర్ తదితరులు పాల్గొన్నారు.


