ఇండియా విన్..!
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
ఆస్ట్రేలియాను కంగారెత్తించినా భారత బౌలర్లు
తక్కువ స్కోరుకే కట్టడి.. బ్యాటింగ్‌లో సత్తా చాటినా రో-కో
ఫాంలోకి కోహ్లి.. రికార్డుల మోత మోగించిన రోహిత్
సిరీస్ పోయినా.. మూడో వన్డేలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్
కాకతీయ, స్పోర్ట్స్ : సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో వన్డేలో కంగారూలు నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 38.2 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (74 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు విజయానికి సహకరించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను గెలుచుకోకపోయినా, చివరి మ్యాచ్‌లో ప్రతిష్ఠను నిలబెట్టుకున్నట్లయింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.

ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే 61 పరుగుల వద్ద హెడ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు ఆధిపత్యం చూపించారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ రాకుండా అడ్డుకున్నారు. అక్షర్ పటేల్, మార్ష్‌ను 49 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. క్యారీ, రెన్షా త్వరగా వెనుదిరగడంతో 183/3 నుంచి 195/5కి పడిపోయింది. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్ సహా టెయిలెండర్లను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియాను 46.3 ఓవర్లలో 236 పరుగులకు పరిమితం చేశాడు. ఆసీస్ బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా (56), మిచెల్ మార్ష్ (41) రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్‌దీప్, అక్షర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.
సత్తా చాటిన రో-కో..!

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన సత్తా చాటాడు. కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో కుమార సంగక్కర రికార్డును దాటి, వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని ముందు ఇప్పుడు సచిన్ టెండుల్కర్ మాత్రమే ఉన్నాడు. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121* పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో తన 33వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరి మధ్య 168 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకం అయ్యింది.



