కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ కలిగించే పోరాటం. ఎప్పుడూ ఈ రెండు జట్లు తలపడితే మైదానంలో హై-వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంటుంది. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆసియా కప్‌లో భాగంగా నేడు దుబాయ్‌లో ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నా, ఎక్కడా కనిపించాల్సిన ఉత్సాహం లేకపోవడం గమనార్హం.
తాజాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. శత్రు దేశమైన పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని చాలామంది భారతీయులు గట్టిగా కోరుతున్నారు. మన సైనికులపై దాడులు జరుగుతుంటే, పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం సరైన సందేశం కాదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో బహిష్కరణ పిలుపులు మరింత ఉధృతమయ్యాయి. ‘బాయ్‌కాట్ ఆసియా కప్’, ‘బాయ్‌కాట్ INDvsPAK’ హ్యాష్‌ట్యాగ్‌లు ‘ఎక్స్’ (Twitter)లో టాప్ ట్రెండ్స్‌గా మారాయి. లక్షలాది ట్వీట్లు వస్తుండటంతో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అయితే మరోవైపు, క్రికెట్ అభిమానుల్లో కొంతమంది మాత్రం మైదానంలో పోటీ వేరు, రాజకీయాలు వేరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనల మధ్య భారత్-పాక్ పోరు ఎంత హడావుడి సృష్టించబోతుందో చూడాలి. ఒకవైపు ఉగ్రదాడి ఆవేదన, మరోవైపు క్రికెట్‌పై మక్కువ ఇవి రెండూ కలిసిపోతూ ఈ మ్యాచ్‌పై ఆసక్తిని కొత్త కోణంలో నిలిపాయి.


