విశ్వ విజేతగా భారత్
ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ కైవసం
ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హర్మర్ కౌర్ సేన అద్భుత ప్రదర్శన
మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌ను ముద్దాడింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వందేమాతరం నామస్మరణ మధ్య తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ మ్యాజిక్.. షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో, అమన్ జోత్ కౌర్ స్టన్నింగ్ క్యాచ్ భారత్‌కు విజయాన్నందించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 299 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లక్ష్య చేదనలో తడబడింది.

దుమ్ము రేపిన బ్యాటర్లు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు దుమ్ము రేపారు. దాంతో సఫారీ ముందు భారత్ 299 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 58 ) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది.
స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక(3/58) మూడు వికెట్లు తీయగా.. మ్లబా, డిక్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్న ఈ జోడీ 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి మంధాన(45)ను ట్రయాన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి జెమీమా రాగా.. షెఫాలీ వర్మ తన జోరును కొనసాగించింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సునె లూస్ బౌలింగ్‌లో షెఫాలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బోచ్ నేలపాలు చేసింది. ఈ అవకాశంతో షెఫాలీ చెలరేగింది. మరో ఎండ్‌లో జెమీమా స్లోగా ఆడినా.. షెఫాలీ వేగంగా పరుగులు రాబట్టింది. సెంచరీ దిశగా సాగిన షెఫాలీ వర్మ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకుంది. ఖాఖా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న దీప్తి శర్మ.. చెలరేగిన రిచా..
ఆ వెంటనే ఖాఖా బౌలింగ్‌లోనే జెమీమా కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భతంగా క్యాచ్ అందుకుంది. ఈ పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 52 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మ్లబా విడదీసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(20)ను క్లీన్ బౌల్డ్ చేసింది. క్రీజులోకి వచ్చిన అమన్ జోత్ కౌర్(12) త్వరగానే వెనుదిరిగింది. దాంతో భారత్ 245 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్‌తో కలిసి దీప్తి శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. రిచా భారీ సిక్స్‌లతో విరుచుకు పడగా దీప్తి శర్మ క్లాస్ బ్యాటింగ్ కొనసాగించింది. ఈ క్రమంలో 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రిచా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి బంతికి దీప్తి శర్మ రనౌట్‌గా వెనుదిరిగడంతో భారత్ 300 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, దీప్తి శర్మ!
టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన నిలిచింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన ఫైనల్లో 45 పరుగులతో రాణించిన స్మృతి మంధాన.. ఈ టోర్నీలో మొత్తం 434 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను మంధాన అధిగమించింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ 409 పరుగులు చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఎడిషన్‌లో స్మృతి మంధాన సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్డ్ట్ 500+ రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో షెఫాలీ వర్మతో కలిసి మంధాన తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది.
భారీ రికార్డు సృష్టించిన దీప్తి
దీప్తి శర్మ మరోసారి తాను టీమిండియా పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ ఎందుకో నిరూపించుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మహిళల ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ఒకే ఎడిషన్‌లో 200 పరుగులు, 15 వికెట్లు పూర్తి చేసిన మొదటి క్రీడాకారిణిగా దీప్తి నిలిచింది. ఆమె ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత్‌ను పటిష్టమైన స్థితికి చేర్చింది. రిచా ఘోష్‌తో ఆమె భాగస్వామ్యం అద్భుతంగా ఉంది. ఇద్దరూ కలిసి చివరి ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచారు. ఫైనల్ మ్యాచ్ లో దీప్తి శర్మ 53 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది.
కిక్కిరిసిన మైదానం..
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ రెండు గంటలు ఆలస్యమైంది. అయినా అభిమానులు ఏమాత్రం సహనం కోల్పోలేదు. వర్షంలో తడుస్తూనే ఓపికగా ఎదురుచూశారు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీయడానికి మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక వార్మప్ కోసం భారత జట్టు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం మొత్తం హోరెత్తింది. 18వ ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు అభిమానుల కేరింతలు తారాస్థాయికి చేరాయి. గతంలో భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఇదే స్టేడియంలో 34,651 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఈ స్టేడియం మొత్తం సామర్థ్యం 45,000. ఇంతవరకు ప్రపంచ కప్ గెలవని రెండు జట్లు టైటిల్ కోసం తలపడటం, దానికి ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం మహిళల క్రికెట్‌కు గొప్ప శుభపరిణామమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అభిమానుల్లో తీవ్ర ఆసక్తి..
ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక సెమీ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకంతో (127) జట్టును గెలిపించిన తీరు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఆమె నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం అందరినీ కట్టిపడేసింది. ఈ విజయంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ‘సోల్డ్ అవుట్’ అని బ్యానర్ ప్రదర్శించాల్సి వచ్చిందని ఐసీసీ తెలిపింది.


