దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు హడావిడి
దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ సన్నాహకాలు ప్రారంభం
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీస్
కాకతీయ, స్పోర్ట్స్ : భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ ఈ నెల 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఇరుజట్లూ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం, ఎందుకంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా ఇది నిర్ణయాత్మకంగా మారబోతోంది. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవ్వడంతో మంగళవారం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో నెట్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు.
ఈ సెషన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో పాటు జైస్వాల్, సాయి సుదర్శన్, బుమ్రా, జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాక్టీస్‌కు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ కోటక్ పిచ్‌ను పరిశీలించారు. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఫామ్ కోల్పోయిన కెప్టెన్ గిల్ ఈసారి ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. సుమారు గంటన్నరపాటు మైదానంలో చెమటోడ్చి, తన ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్ పైన దృష్టి పెట్టాడు. గిల్ ప్రాక్టీస్ సెషన్ మొత్తం గంభీర్ వ్యక్తిగతంగా గమనించటం కూడా హైలైట్‌గా నిలిచింది.
సెంటర్ వికెట్‌పై సాయి సుదర్శన్ ఎక్కువగా లెగ్‌సైడ్ షాట్లపై దృష్టి పెట్టాడు. దీని ఆధారంగా అతడిని వన్‌డౌన్ స్థానంలో ఆడించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండు అన్ అఫీషియల్ టెస్టుల్లో 84 పరుగులు తీసిన నేపథ్యంలో మూడో నెంబర్ బ్యాటర్ గా టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ సుదర్శన్ కు కొనసాగుతోంది. మరోవైపు జైస్వాల్ స్పిన్నర్లు జడేజా, సుందర్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ప్రాక్టీస్ చేశాడు. పేసర్ బుమ్రా ప్రాక్టీస్‌లో కేవలం అర్ధగంట మాత్రమే పాల్గొన్నాడు. వార్మప్ తర్వాత కొద్దిసేపు బౌలింగ్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో అతడి కుడి మోకాలికి పట్టీ కనిపించడం ఆందోళన కలిగించే విషయం.
ఇంకోవైపు దక్షిణాఫ్రికా జట్టు సన్నాహకాలు కూడా జోరందుకున్నాయి. పాక్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించిన సౌతాఫ్రికా జట్టు కోల్‌కతాలో ప్రాక్టీస్ ప్రారంభించింది. భారత్ యువ ఆటగాళ్లు సత్తా చాటాలన్న తపనతో ఉండగా, సౌతాఫ్రికా తమ సీనియర్ బౌలర్లతో కంబ్యాక్ టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తొలి టెస్టు రసవత్తరంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


