భారత్ హిందూ రాష్ట్రం
దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరమా?
సూర్యుడు తూర్పున ఉదయించినట్లే హిందూ రాష్ట్రం సత్యం
హిందుత్వం మతం కాదు… జీవన విధానం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కాకతీయ, నేషనల్ డెస్క్ : “సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు… దీనికి రాజ్యాంగం నుంచి ప్రత్యేక ఆమోదం అవసరమా? భారత్ హిందూ రాష్ట్రం అన్నది కూడా అలాంటి సత్యమే” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని భగవత్ స్పష్టం చేశారు. “ఎవరు ఈ దేశాన్ని తమ మాతృభూమిగా భావిస్తారో, ఎవరు ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తారో… అప్పటి వరకు భారత్ హిందూ రాష్ట్రమే. రాజ్యాంగంలో ఆ పదం ఉన్నా లేకపోయినా అది మా దృష్టిలో పెద్ద విషయం కాదు. ఇది ఒక సత్యం” అని అన్నారు.
కులవ్యవస్థ హిందుత్వ లక్షణం కాదు
పుట్టుకతో వచ్చే కులవ్యవస్థ హిందుత్వానికి సంబంధించినది కాదని భగవత్ పేర్కొన్నారు. హిందుత్వాన్ని సంకుచిత మతపరమైన కోణంలో చూడటం సరికాదని, అది సమాజాన్ని కలిపే జీవన విధానమని వివరించారు. ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే ప్రచారాన్ని భగవత్ తీవ్రంగా ఖండించారు. “ఆర్ఎస్ఎస్ ఒక పారదర్శక సంస్థ. మాపై అనుమానం ఉంటే ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు. మేము హిందువులను సంఘటితం చేస్తాం, అంతమాత్రాన మేము ముస్లింలకు వ్యతిరేకం కాద”ని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
“ప్రపంచంలో హిందువులకు ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమ రక్షణ కోసం ఐక్యంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వారికి అండగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.
లివ్-ఇన్ సంబంధాలపై విమర్శ
లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌పై స్పందించిన భగవత్… అవి బాధ్యత నుంచి తప్పించుకోవడమేనని వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థ కేవలం శారీరక తృప్తి కోసం మాత్రమే కాదని, అది సమాజానికి మూలమని అన్నారు. దేశ జనాభాను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యామని భగవత్ అభిప్రాయపడ్డారు. 50 ఏళ్ల ప్రొజెక్షన్‌తో ప్రభుత్వం ఒక స్పష్టమైన జనాభా విధానాన్ని రూపొందించాలని సూచించారు.
డాక్టర్లు, నిపుణుల అభిప్రాయం మేరకు ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే ‘అహం’ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని తనకు తెలిసిందని తెలిపారు.


