కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న దాదాపు 16 వేల విదేశీయులను భారత్ నుంచి బహిష్కరించేందుకు హోం మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇతర ఏజెన్సీలు కలిసి చేపట్టిన తనిఖీల్లో ఈ విదేశీయులను గుర్తించారు. వీరిలో కొంతమంది మాదకద్రవ్యాల రవాణా, నేరచర్యలు, నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచి, దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఈ చర్యలు తాజాగా అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం – 2025 లో భాగంగా చేపట్టబడుతున్నాయి. పాత నాలుగు చట్టాలను రద్దు చేస్తూ రూపొందించిన ఈ కొత్త చట్టానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభించగా, రాష్ట్రపతి ఏప్రిల్ 4న ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై అక్రమ పత్రాలతో దేశంలోకి ప్రవేశించిన వారికి కనీసం రెండు సంవత్సరాల జైలుశిక్ష, గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు శిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అయితే ఇంకా కోట్లాది ప్రజలు పేదరికంలోనే జీవిస్తున్నారు. పేదలను ఆదుకోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చిన విదేశీయులు కూడా ఈ పథకాల లబ్ధి పొందడం వల్ల అసలు అర్హులైన పేదలకు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు కేంద్రం కొత్త వలస చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై అక్రమ వలసదారులకు ఎలాంటి ఉపశమనం ఉండదు. నకిలీ పత్రాలతో దేశంలో ఉండే వారికి తక్షణమే చర్యలు తీసుకుంటారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ చర్యలతో భారత్‌లో అక్రమ వలసల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే దేశ భద్రత, చట్టవ్యవస్థకు భంగం కలిగించే విదేశీయులను తరిమివేయడం ద్వారా అంతర్గత భద్రత మరింత బలోపేతం కానుంది.


