కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ చైనాల మధ్య దాదాపు 5ఏళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరచుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, టిబెట్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఈ పాస్ లు తెరుచుకున్న విషయాన్ని అధికారికంగా తెలిపాయి. ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వాంగ్ యిూ, జైశంకర్ న్యూఢిల్లీలో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా తెరచుకున్న మార్గాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ది షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్ లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ ఉన్నాయి. 2020లో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీటిని మూసివేశారు. ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నా..సరిహద్దు ఘర్షణలు, దీర్ఘకాలికంగా ఉన్న సైనిక ఉద్రిక్తతలతో అవి మళ్లీ తెరచుకోలేదు. ఈ ట్రేడ్ పోస్టులు ఇరువైపులా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు వాడుకుంటారు. ఈ మార్గాలు చైనా వైపు షిగాట్సె, లాసా, న్యింగ్చిలను చేరుతాయి. నిజానికి ఈ మార్గాల్లో వాణిజ్యం మే నవంబర్ మధ్యలో జరుగుతుంది. వాస్తవానికి ద్వైపాక్షిక వాణిజ్యానికి భిన్నంగా ఈ మార్గాల్లో జరిగే వ్యాపారంలో భారత్ ఎక్కువ ఎగుమతులతో లబ్ది పొందింది.
ఈ మూడింటిని నాథులా పాస్ అత్యంత రద్దీగా ఉండే మార్గమని చెప్పవచ్చు. రాకపోకలు, వాణిజ్యం అత్యధికంగా దీని నుంచే జరుగుతుంది. సిక్కిం టిబెట్ ల మధ్య బలమైన వాణిజ్యానికి కూడా కారణం ఇదే. 2016లో ఈ మార్గం నుంచి అత్యధికంగా రూ. 82.6కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఆ తర్వాత మళ్లీతగ్గింది. షిప్కిలా పాస్ నుంచి వాణిజ్యం పరిమితంగానే జరుగుతోంది. ఇది భారత్ లోని నేషనల్ హైవే 5కు అనుసంధానమైన ఉంది. దీనికి రెండు వైపులా కస్టమ్స్ ఔట్ పోస్టులున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వాణిజ్యం జరగలేదని చెప్పాలి. లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్ లోని పిథోర్ ఘడ్ కు అనుసంధానమై ఉంటుంది. ఈ మార్గంలో రహదారి సౌకర్యం అంత అనువుగా ఉండదు.


