పంటల సాగులో
డ్రోన్లను వినియోగించుకోవాలి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
డార్మెటరీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు
ఐనవోలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ
మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు
కాకతీయ, హనుమకొండ : వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ముఖ్యంగా పంటల సాగులో డ్రోన్ల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాబార్డ్ పథకం కింద వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సొసైటీ (నందనం)కు డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం), పీఏసీఎస్ నర్సంపేట, పీఏసీఎస్ నెల్లికుదురు సొసైటీలకు అందించనున్న మూడు డ్రోన్ల వివరాలను వ్యోమిక్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధులు హనుమ, జగదీష్ కలెక్టర్‌కు వివరించారు.
రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలి
డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని, రైతులు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంతో పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్‌ను కలెక్టర్ సందర్శించి అక్కడ విక్రయానికి ఉంచిన వివిధ వస్తువులను పరిశీలించారు. రూరల్ మార్ట్ నిర్వహణ బాగుందని, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. స్థానిక ప్రజలు ఈ మార్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మల్లికార్జునస్వామి దర్శనం
అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నిధులతో నిర్మాణంలో ఉన్న డార్మెటరీ హాల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై వివరాలు తెలుసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
ఐనవోలు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్‌ను పరిశీలించి భూ భారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులపై తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలుపై సమీక్షించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయానికి అదనపు గదులు అవసరమని ఎంపీడీవో నర్మద కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ రవీందర్ రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, వరంగల్ అధికారి చైతన్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీఓలు సంజీవరెడ్డి, నీరజ, హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, సహకారశాఖ ఏరియా అధికారి జగన్మోహన్ రావు, స్థానిక సర్పంచులు రఘువంశీ, రాజు, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద తదితరులు పాల్గొన్నారు.


