మున్సిపల్ ఎన్నికల్లో
బీఆర్ఎస్కు పట్టంకట్టాలి
గులాబీ పార్టీతోనే కరీంనగర్ నగర అభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేంలేదు
రెండేళ్లలో ఎలాంటి నిధులు తీసుకురాలేదు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఐదవ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఐదవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గాదె రూప–శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన గంగుల కమలాకర్‌కు డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా నగర అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దుర్షేడ్, గోపాలపూర్, బొమ్మకల్ తదితర డివిజన్లలో ప్రజలు బీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఐదవ డివిజన్ అభ్యర్థి గాదె రూప–శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


