నల్లబెల్లి మండలంలోని మద్దిమేడారంలో
గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ
కాకతీయ. నల్లబెల్లి:మద్ది మేడారం జాతరలో భాగంగా బుధవారం రాత్రి 10.04 నిమిషాలకు గాంధీనగర్ నుంచి సారలమ్మ బయలుదేరి గద్దెలపైకి చేరుకున్నారు. స్థానిక ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య సారలమ్మను గద్దెలకు తీసుకువచ్చారు.
ఆలయ పూజారులు దురిశెట్టి నాగరాజు, హరికృష్ణలు తమ స్వగ్రామమైన గుండ్లపహాడ్ శివారు గాంధీనగర్ నుంచి డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మను మద్ది మేడారం జాతర గడ్డకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల జయజయధ్వానాలతో పరిసరాలు మార్మోగాయి.
మనదేవతలకు జాతర చైర్మన్ పబ్బు రాజేష్–మీనా దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్థానిక తహసిల్దార్ ముప్ప కృష్ణ, ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఏ. శ్రీనివాసరావుల చేతుల మీదుగా వనదేవతలకు ప్రత్యేక వస్త్రాలంకరణ నిర్వహించారు.


