కార్పొరేషన్ ఎన్నికల్లో
కాంగ్రెస్‌ను ఆదరించండి
కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
వెలిచాల రాజేందర్‌రావు
48వ డివిజన్‌లో బస్తీబాట
యువతకు టికెట్లపై కీలక వ్యాఖ్యలు
కాకతీయ, కరీంనగర్ : రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అప్పుడే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఆశయాల బాటలో పయనిస్తున్నానని తెలిపారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో 48వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాజేందర్‌రావు ప్రారంభించారు. అనంతరం డివిజన్ అంతటా బస్తీబాట నిర్వహించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. మహిళల మంగళహారతులు, ఒగ్గుడోలు కళాకారుల డప్పుచప్పుళ్ల మధ్య కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. గతంలో కరీంనగర్లో పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయడం వృథా అని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నగర సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌కే అవకాశం ఇవ్వాలని కోరారు.
యువతకు టికెట్లలో ప్రాధాన్యం
కొత్తపెల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో 46వ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది ప్రజలు, గంగపుత్ర సంఘం నాయకులు రాజేందర్‌రావును కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే యువత రాజకీయాల్లో ముందుకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజేందర్‌రావు స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


