- ‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు
- పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల పూడ్చివేత
కాకతీయ, వరంగల్: వరంగల్ ఆర్టీఏ ట్రాక్ బాగుపడింది. మొన్నటి వరకు ట్రాక్ నిండా బురద, చుట్టూ అడవిని తలపించేలా ఉన్న మొక్కలను శుక్రవారం ఆర్టీఏ అధికారులు తొలగించారు. కాకతీయ దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీఏ అధికారులు ట్రాక్ ను కాసింత మెరుగుపరిచారు. వాస్తవానికి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్టీఏ ఆఫీసులో టెస్ట్ డ్రైవింగ్ నిర్వహిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా రోడ్డు ట్రాక్ ఏర్పాటు చేస్తారు. కానీ ఆ ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ట్రాక్ మధ్యలో బురద నీరు చేరి అధ్వానంగా తయారైంది. ట్రాక్ పొడవునా అడవిని తలపించేలా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ‘కాకతీయ’ బుధవారం ఓ కథనం ప్రచురించింది. దీనికి ఆర్టీఏ అధికారులు స్పందించి ట్రాక్ మధ్యలో బురద గుంతలను చదునుచేశారు. ట్రాక్ చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను నరికేశారు. అయితే, ఆ బురద నీరు చుట్టు పక్కల నివాసాల నుంచి వచ్చిన మురుగునీరుగా ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. అసలు ఈ ఏరియాలో డ్రెయినేజీ వ్యవస్థను నగర పాలక సంస్థ ఏర్పాటు చేయలేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయలోపంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు.


