తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు
కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక
ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు
కుటుంబ ప్రాధాన్యంపై విమర్శలు
పక్షపాత నిర్ణయాలపై అసంతృప్తి
రహస్య లేఖ బహిర్గతంతో వర్గపోరు స్పష్టత
రాష్ట్ర మహాసభల ముందు ఉద్రిక్తత
కాకతీయ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వామపక్ష రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ జారీ చేసిన అభిశంసన లేఖ బయటకు రావడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖలో రాష్ట్ర స్థాయి కీలక నేత తమ్మినేని వీరభద్రంపై పలు ఆరోపణలు ప్రస్తావించబడినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్టీ రాజ్యాంగంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇచ్చే అధికారిక హెచ్చరికనే అభిశంసనగా పరిగణిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు భావించినప్పుడు విచారణ అనంతరం కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. తమ్మినేనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
లేఖలోని ఆరోపణలు ఇవే..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నాయకులతో కలిసి నిర్వహించిన వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా లేఖలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో తనకు అనుకూలమైన వర్గానికే పదవులు కేటాయించి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని పక్కన పెట్టారనే ఫిర్యాదులు కూడా కేంద్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన నేతగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని లేఖలో సూచించినట్లు చెబుతున్నారు.
లేఖ బహిర్గతంపై ఆందోళన
ఇలాంటి అంతర్గత పత్రాలు సాధారణంగా బయటకు రావు. కానీ ఈసారి లేఖ బహిర్గతం కావడం పార్టీలో వర్గపోరును బహిరంగం చేసింది. తమ్మినేని అనుచరులు మాత్రం వ్యతిరేక వర్గమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి స్థాయి నేతపై కేంద్ర కమిటీ ఘాటు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అది బయటపడడం పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసిందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ్మినేని ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ పరిణామం ఆయన పదవిలో కొనసాగడంపై అనుమానాలు రేకెత్తించింది. త్వరలో జరగబోయే రాష్ట్ర మహాసభల ముందు ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తమ బలంగా చెప్పుకునే వామపక్ష పార్టీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా మాత్రమే కాక సిద్ధాంతపరంగానూ చర్చకు దారి తీసింది. పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.


