అక్రమ బెల్లం తరలింపు భగ్నం
రూ.11 లక్షల విలువైన బెల్లం స్వాధీనం
లారీ డ్రైవర్ అరెస్ట్, యజమాని పరార్
కాకతీయ, కూసుమంచి :నల్లబెల్లం, కట్టిక నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులు మరోసారి భారీ దాడి చేశారు. కూసుమంచి మండలంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, శుక్రవారం రాత్రి జాతీయ రహదారి–365బీపై నిర్వహించిన రూట్ వాచ్‌లో అక్రమంగా బెల్లం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. నాయకన్‌గూడెం గ్రామ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 21,420 కిలోల నల్లబెల్లం, 200 కిలోల కట్టికను గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ దాదాపు రూ.11 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
లారీ డ్రైవర్ అరెస్ట్
ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ షేక్ రసూల్ (ఏ–1)ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లారీ యజమాని, కర్ణాటకకు చెందిన సాహెబ్ ఖాన్ (ఏ–2) పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి అక్రమ సరుకుతో పాటు లారీ, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సుంకరి రమేష్ తెలిపారు. మండలంలో నాటుసారా తయారీకి బెల్లం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు లత, పృద్వి, సిబ్బంది శ్రీనివాస్, రామారావు, వెంకటేశ్వర్లు, లాలు, హరీష్, బలరాం, సునీత, శ్రీలక్ష్మి, సంపూర్ణ, వినీత్ పాల్గొన్నారు. అక్రమ నాటుసారా తయారీ, రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


