మేడారం లో అక్రమ వలసలు ఆపాలి
పేసా చట్టాల అమలు తప్పనిసరి చేయాలి
తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు
కాకతీయ, ఏటూరునాగారం : మేడారం ప్రాంతంలో అక్రమ వలసలను అరికట్టి గిరిజన హక్కులను కాపాడాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాదర్బార్, గిరిజన దర్బార్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మేడారం పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతం అని పేర్కొన్నారు. పొడెం బాబు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నివాసం ఉండాలంటే చట్టాలకు లోబడి ఉండాలని తెలిపారు. 1/59, 1/70 ఎల్ టి ఆర్ చట్టాలు, పేసా గ్రామ సభ తీర్మానాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు చట్టాలను ఉల్లంఘిస్తూ భూములు కొనుగోలు చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపించారు.
అక్రమ వలసలపై ఆందోళన
కొప్పుల రవి మాట్లాడుతూ, ఈ పరిస్థితి కొనసాగితే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని తెలిపారు. మేడారం ప్రాంతంలో ఆదివాసుల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేసా గ్రామ సభ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. వన్ బై సెవెంటీ చట్టం ప్రకారం భూముల కొనుగోలు, విక్రయాలు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రత్యేక జీవో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ములుగు జిల్లా ప్రెసిడెంట్ నల్లెబోయిన లక్ష్మణ్ దొర, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, కొప్పుల జగన్, వంక నరేష్, బొచ్చు ప్రకాష్, బాడిశే ఆదినారాయణ, తుర్స చంటి దొర, కోరేం మొగిలి తదితరులు పాల్గొన్నారు.


