గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు
జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు
కాకతీయ,కారేపల్లి : గంగాదేవి గుట్టలో అక్రమ మట్టి తవ్వకాలు ఆపకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు హెచ్చరించారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. కారేపల్లి మండలం గుట్టకిందగుంపు గ్రామపంచాయతీ పరిధిలోని గంగాదేవి గుట్టలో గిడ్డంగి నిర్మాణం పేరిట భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు మాట్లాడుతూ కాంట్రాక్టర్ లక్షల రూపాయల లాభం కోసం పచ్చటి గుట్టను నాశనం చేస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడని మండిపడ్డారు. గుట్టపై స్వయంభూ కాళిక మాత విగ్రహం ఉండగా చుట్టుపక్కల మట్టి తవ్వడం వల్ల విగ్రహం కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసుల ఆరాధ్యదైవమైన కాళిక మాతకు అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తవ్విన మట్టిని అమ్ముకుని సంపాదించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా గిడ్డంగి నిర్మాణం ఎలా జరుగుతోందన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుట్టను కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవులు, లక్ష్మీనర్సు, కాంగ్రెస్ నాయకుడు తోగర శ్రీను తదితరులు పాల్గొన్నారు.


