ఎస్సారెస్పీ భూముల్లో అక్రమ నిర్మాణాలు
పనులు నిలిపివేసిన అధికారులు
కాల్వ భూములకు హద్దుల మార్కింగ్ పూర్తి
అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగించాలి : ప్రజల డిమాండ్
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాలి కాల్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టడం స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాల్వ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా విభజిస్తూ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కొంతకాలంగా కెనాలి కాల్వ భూములపై అక్రమ ఆక్రమణలు పెరుగుతున్నాయని, వాటివల్ల కాల్వ ప్రవాహానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కేవలం పనులు నిలిపివేయడానికే పరిమితం కాకుండా, ఇప్పటికే నిర్మించిన అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డీఈ రవి, ఏఈ పవిత్ర సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకొని, అధికారిక మ్యాప్ ఆధారంగా కాల్వ భూములకు హద్దులు నిర్ణయించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలకు రెడ్ మార్కింగ్ కూడా చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కాల్వ భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాల్వ భూములను పూర్తిగా రక్షించి, హద్దులు శాశ్వతంగా స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఫెన్సింగ్ చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు.


