వసూళ్లు షూరు
ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
లోడింగ్ చార్జీల పేరుతో లారీ డ్రైవర్లకు వేదింపులు
కలెక్టర్, సీపీ తనిఖీలు చేసినా మారని తీరు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇసుక రీచ్ నిర్వాహకులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక రీచ్‌ల నిర్వాహకుల అక్రమాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గినట్టుగా కనిపించిన అక్రమ వసూళ్లు మళ్లీ షూరు అయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణాపై ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు పూర్తి విరుద్ధంగా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఇసుక రీచ్‌లలో లోడింగ్ పేరుతో అక్రమ వసూళ్ల దందా తారస్థాయికి చేరడంతో లారీ డ్రైవర్లు ఈ అక్రమాలపై టీజీఎండీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఇసుక నిర్వహణ, రవాణా నిబంధనల ప్రకారం జరగాలని, లోడింగ్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై శాఖాపరమైన కేసులు నమోదు చేస్తామని అవసరమైతే రీచ్ నిర్వహణ అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరికలతో కూడిన కఠిన ఆదేశాలు జారీ చేశారు.

https://www.kakatiyanews.com/wp-content/uploads/2026/01/challuru-2.aac
యథేచ్ఛగా అక్రమ వసూళ్లు
కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక రీచ్‌లలో అక్రమ వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు ఇచ్చినా మాకు ఏమీ కాదు అన్న తీరులో నిర్వాహకులు లోడింగ్ చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో లోడింగ్ చార్జ్, పట్టా, లెవలింగ్ తదితర కారణాలతో ఒక్కో లారీపై రూ.5,600 వరకు వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ అక్రమాలపై లారీ డ్రైవర్లు, ఇసుక లారీ అసోసియేషన్ సభ్యులు టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పట్లో నిర్వాహకులు లోడింగ్ చార్జీలను రూ.1,500కు కుదించి గుట్టుచప్పుడు కాకుండా వసూళ్లు కొనసాగించారు. అయితే అక్రమంగా రూ.1,500 వసూళ్లపై కూడా లారీ డ్రైవర్లు, సంఘ నేతలు ప్రశ్నించడంతో కొంతకాలం వివిధ కారణాలు చెబుతూ లోడింగ్ ప్రక్రియను నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా మళ్లీ ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ చార్జ్, పట్టా, లెవలింగ్ పేరుతో అక్రమ వసూళ్ల బాగోతం తెరపైకి వచ్చింది. లోడింగ్ చార్జ్ పేరుతో ఒక్కో లారీపై రూ.3,200 వరకు వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు.
లోడింగ్ చార్జీల పేరుతో లారీ డ్రైవర్లకు వేదింపులు
కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్‌లలో లోడింగ్ చార్జీలు ఇవ్వకపోతే ఇసుక లోడింగ్ చేయబోమని నిర్వాహకులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. రూ.3,200 ఇవ్వకపోతే లారీలను గంటల తరబడి పక్కకు పెట్టి వేదింపులకు గురిచేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అక్రమాలన్నీ ఇసుక రీచ్ లలోని సంబంధిత టీజీఎండీసీ ఏస్ఆర్‌వోల కళ్ల ముందే జరుగుతుండటం గమనార్హం. ఇందుకు నిదర్శనంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పరిధిలోని చల్లూరు ఇసుక రీచ్‌లో లోడింగ్ చార్జ్ ఇవ్వలేదన్న కారణంతో లారీలో ఇసుక లోడ్ చేయకుండా ఇసుక కోసం వచ్చిన లారీని పక్కకు పెట్టిన ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ కాకతీయ దినపత్రిక చేతికి చిక్కింది.
కలెక్టర్, సీపీ తనిఖీలు చేసినా మారని తీరు
కరీంనగర్ జిల్లాలో ఇసుక రీచ్‌లలో జరుగుతున్న అక్రమాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఇటీవల అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణా, రీచ్‌ల నిర్వహణ నిబంధనల ప్రకారం జరగాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగినా ఇసుక రీచ్‌లలో అక్రమాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


