సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు అన్యాయం
పరకాల ఎమ్మెల్యే రేవూరి
బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం
ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్ట్.. గీసుగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
కాకతీయ, గీసుగొండ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం తీవ్ర అన్యాయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామంలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయం వైపు కాంగ్రెస్ శ్రేణులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, మామునూరు ఏసీపీ వెంకటేష్, గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ సిబ్బందితో కలిసి ముట్టడిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న ప్రాంతాల్లో బీజేపీ తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పెట్టుబడుల విషయంలో ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


