అక్రమాస్తులు రూ. 100 కోట్లు!
వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు
మొత్తం ఎనిమిది చోట్ల అధికారుల సోదాలు
భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
రూ.30 లక్షల నగదు, 3 కేజీల బంగారం సీజ్
పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ఎల్బీనగర్‌లో ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ..
గతనెలలో రూ. 60 వేలు తీసుకుంటూ సస్పెన్షన్
హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌పై అనేక అవినీతి ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సస్పెన్షన్‌లో ఉన్న హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అతడి ఇల్లు సహా ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో వెంకటర్‌రెడ్డి వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు తేల్చారు. 4.65 కోట్ల విలువ చేసే విల్లాతో పాటు ఒక ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. 60 లక్షల విలువ చేసే వ్యాపార సముదాయం, 65 లక్షల విలువచేసే 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు ఇంట్లో రూ. 30 లక్షల నగదు 44.3 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 297గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెలలో 60 వేల లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. పాఠశాల అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఉన్నత స్థానంలో ఉండి కూడా…
గత డిసెంబర్ 6న హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. వెంకట్ రెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేయడంతో పాటు, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో.. ఓ ప్రైవేట్ స్కూల్‌కు సంబంధించిన రెన్యువల్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నుంచి ఆయన లంచం డిమాండ్ చేశాడు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా లంచానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వెంకట్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో ఆయన బాధితులు హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.


