అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
47వ డివిజన్ అధ్యక్షులు గంధసిరి శ్రీకాంత్
అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా బీజేపీ నేతల అరెస్టు
కాకతీయ, హనుమకొండ : ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంధసిరి శ్రీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెల్లవారుజామున అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాయిత రాజ్ కుమార్, 62వ డివిజన్ అధ్యక్షులు మేకల శ్రవణ్ యాదవ్, 63వ డివిజన్ అధ్యక్షులు రేణికుంట్ల కళ్యాణ్ కుమార్, అలాగే నాయకులు గిరి తిరుపతి, సుంచు ప్రశాంత్, మేకల రవి కుమార్, లింగ స్వామి, రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


