- సర్కార్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ప్రశ్నలు
- ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతులు నిలిపివేసినప్పటికీ .. మళ్లీ అనుమతులు వచ్చాయంటూ ఆదిత్య తన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నదని, దీనిలో ఎవరెవరికి ఎంత ముట్టాయని ఆయన నిలదీశారు. అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని.. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కాపీ పంపుతానని ఎంపీ ప్రకటించారు.
ఎంత ముట్టింది..?
నార్సింగిలో బహుళ అంతస్తుల నిర్మాణానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇవ్వగా, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశారని అన్నారు. ఆదిత్య పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేస్తున్నదని చెప్పారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుమతించారా ..? మంత్రులు ఒకే చెప్పారా ? ఎన్ని డబ్బులు చేతులు మారాయి ? అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. శ్రీ ఆదిత్య బరితెగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వంలో అనుమతులు
శ్రీ ఆదిత్య వింటేజ్‌కి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయని ఎంపీ రఘునందన్ రావు మీడియాకు వెల్లడించారు. ఇది అక్రమ నిర్మాణం అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైందని గుర్తు చేశారు. మూసీ పరివాహకంలో ఆదిత్య వింటేజ్ కడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భారీ కుంభకోణం నడిచిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేశారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు నిర్మాణ పనులు కొనసాగించడం ఏంటని రఘునందన్ ప్రశ్నించారు.
పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారు
పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని…పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.హెచ్‌ఎమ్‌డీఏ అధికారులే కేసులు వేస్తారని.. మళ్లీ వారే అనుమతి ఇస్తారని విమర్శించారు. ఈ నిర్మాణ అనుమతులలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, హద్దులు తొలగించారని క్రిమినల్ కేసులు నమోదు చేశారని.. ఈ నిర్మాణంలో సూట్ కేసులు అందుకుంటున్న మంత్రులు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.


