గెలిపిస్తే..రూ.ముప్పై లక్షలిస్తా
వెల్ది సర్పంచ్ అభ్యర్థి మధు సుదన్ రావు బాండ్ పేపర్ హామీ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని వెల్ది గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మధ్య అభ్యర్థి కొరుకంటి మధు సుదన్ రావు ఇచ్చిన విరాళ హామీ స్థానికంగా సంచలనానికి దారి తీసింది. సర్పంచ్‌గా గెలుపొందిన వెంటనే గ్రామ పంచాయతీ అభివృద్ధికి స్వచ్ఛందంగా రూ.30 లక్షలు అందజేస్తానని ఆయన హామీ పత్రం ద్వారా ప్రకటించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళల సమక్షంలో విడుదల చేసిన ఈ హామీ పత్రంలో గ్రామ అభివృద్ధి పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి అవసరమైతే ప్రభుత్వం నుంచి అదనపు నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని మధు సుదన్ రావు పేర్కొన్నారు. అవినీతి రహిత, పారదర్శక పరిపాలన అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల సమయంలో హంగు ఆర్భాటాలు, డబ్బుల పంపిణీ వంటి పాత రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేసిన ఆయన యువత, మహిళల ఆధ్వర్యంలో గ్రామానికి కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాలనే సంకల్పం వ్యక్తం చేశారు.


