అడుగుపెడితే అరెస్టులే!
రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరకు అనుమతి లేదు
రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ కార్యక్రమాలు నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే అటవీ, క్రిమినల్ కేసులు
భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వో కిష్టగౌడ్
డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేగళ్ల క్రాస్ రోడ్డులో శ్రీ సాతి భవాని మహా జాతర నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా జాతర నిర్వహించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) డీఎఫ్‌వో కిష్టగౌడ్ స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. బంజారా సంఘాల జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరుతో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ సాతి భవాని మహా జాతర నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గోడపత్రికలు విడుదల చేశారని తెలిపారు. అయితే జాతర జరగనున్న రేగళ్ల క్రాస్ రోడ్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్, కంపార్ట్మెంట్ నంబర్–1, చాతకొండ బీట్, కొత్తగూడెం రేంజ్ పరిధిలోకి వస్తుందని వివరించారు.
ఎకో సెన్సిటివ్ జోన్‌లో జాతర నిషేధం
జాతర నిర్వహించనున్న ప్రాంతం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యానికి అనుబంధంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతమని డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి జాతరలు లేదా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. అటవీ శాఖ నుంచే కాకుండా జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ లేదా ఇతర ఏ ప్రభుత్వ విభాగం నుంచీ జాతర నిర్వహణకు ఎలాంటి అనుమతులు జారీ కాలేదని స్పష్టం చేశారు. భక్తులు గోడపత్రికలను నమ్మి ఆ ప్రాంతానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని జిల్లా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని కార్యక్రమాలకు అటవీ ప్రాంతంలో స్థానం లేదని ఆయన తేల్చిచెప్పారు.
నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు
రిజర్వ్ ఫారెస్ట్‌లో అనధికారికంగా ప్రవేశించినా, అక్రమంగా ఆక్రమణలకు పాల్పడ్డా, ఎలాంటి అనుమతులు లేకుండా జాతరలు లేదా కార్యక్రమాలు నిర్వహించినా తెలంగాణ అటవీ శాఖ చట్టం–1967, వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో హెచ్చరించారు. జాతరను ప్రేరేపించిన వారిపై మాత్రమే కాకుండా, జాతరకు హాజరయ్యే వారిపైనా అటవీ కేసులతో పాటు పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బంజారా జేఏసీ సంఘాల తరఫున హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ అనుమతి లేని జాతర నిర్వహణకు ప్రయత్నాలు కొనసాగితే మరింత కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్ష్మీదేవిపల్లి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో రేగళ్ల క్రాస్ రోడ్డులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర నిర్వహణకు అనుమతి లేదని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. బంజారా జేఏసీ నాయకులపై ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయని, రెవెన్యూ శాఖ తరఫున కూడా సంబంధిత వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేసినట్లు డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ తెలిపారు.


