ఆక్రమిస్తుంటే.. చూస్తుంటారా..?!!
కబ్జా కోరల్లో ఓరుగల్లు చారిత్రక కోట
భూ మాఫియా చేతుల్లో మట్టి–రాతి కోటలు
ఖిల్లాలో ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేస్తున్న వైనం
కనుమరుగవుతున్న కాకతీయుల చరిత్ర
ఏఎస్ఐ పలుమార్లు నోటీసులు జారీ
చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు
కోట భూములు రక్షించాలని తాజాగా సీఎంకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఏఎస్ ఐ నోటీసులిచ్చినా.. కలెక్టర్లు చర్యలు తీసుకోలేదని తప్పుబట్టిన కేంద్రమంత్రి
మరోసారి తెరమీదకు కోట భూముల కబ్జా వ్యవహారం
కేంద్రమంత్రి లేఖతోనైనా ప్రభుత్వం స్పందించేనా
కలెక్టర్ సత్యశారద , రెవెన్యూ అధికారులు కదిలేనా..?!
కాకతీయ, ప్రత్యేక ప్రతినిధి : చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు కోట ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రాతి కోట, మట్టి కోట ప్రాంతాలు భూ బకాసురుల కోరల్లో చిక్కి విలువను కోల్పోతున్నాయి. వరంగల్ కోట పరిధిలో నిరంతరంగా జరుగుతున్న అక్రమ ఆక్రమణలు ఇప్పుడు చరిత్ర పరిరక్షణకే సవాల్‌గా మారాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల బినామీలు వాటిని కబ్జా చేస్తూ కోటకు బీటలు వేస్తున్న పరిస్థితి నెలకొంది.

మట్టి–రాతి కోట చుట్టూ వందల అక్రమ నిర్మాణాలు
వరంగల్ కోట లోపలి భాగంతో పాటు మట్టి కోట చుట్టూ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగర శివార్లలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆక్రమణలు మరింత జోరందుకున్నాయి. కొన్ని చోట్ల నీటితో నిండిన ఆగడ్త (కందకం)ను సైతం మట్టితో పూడ్చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇటీవల మట్టి కోట సమీపంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్న కందకాన్ని ఆక్రమణదారులు మొరంతో పూడ్చేసి చదును చేసిన ఘటనలు కలకలం రేపాయి. మరికొన్ని చోట్ల ముందుగా చెత్త గుట్టలు వేసి, ఆపై చదును చేసి అక్రమ లేఅవుట్లు వేస్తూ భూములను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట లోపలి భాగంలోని వ్యవసాయ భూముల్లోనూ స్థిరాస్తి వ్యాపారులు అక్రమ లేఅవుట్లు చేసి అమ్మకాలు జరుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

ఏఎస్ఐ నోటీసులు జారీ.. కానీ చర్యలు శూన్యం
ఓరుగల్లు కోట భారత పురావస్తు శాఖ ( ఏఎస్ ఐ) పరిరక్షణలో ఉన్న స్మారక చిహ్నం. చట్టం ప్రకారం కోట సరిహద్దుకు 100 మీటర్ల లోపు ప్రాంతం నిషేధిత జోన్ కాగా, ఆ తర్వాత 200 మీటర్ల వరకు నియంత్రిత ప్రాంతంగా గుర్తించారు. అయినప్పటికీ ఈ నిబంధనలను ఆక్రమణదారులు బేఖాతరు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఏఎస్ఐ అధికారులు పదేపదే నోటీసులు జారీ చేస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. 2022 నుంచే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఎస్ఐ అనుమతి లేకుండా ఇంటి నెంబర్లు కేటాయించడం, విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయడం నిషిద్ధమైనా సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ జోక్యం.. కానీ మార్పు ఎక్కడ?
ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి, వరంగల్ కోట పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని, పురావస్తు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. గతంలో ఏఎస్ ఐ అధికారులు ఆక్రమణలపై నోటీసులు జారీ చేసినా.. ఆక్రమణలు తొలగించడానికి రెవెన్యూ శాఖ ముందుకు రాలేదని సమాచారం. దీంతో ఆక్రమణలు ఏమాత్రం తగ్గలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై స్థానికులు, చరిత్రకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందే అర్హత ఉన్న వరంగల్ కోటను పరిరక్షించకపోతే భవిష్యత్ తరాలకు చరిత్రే మిగలదని చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, అక్రమ ఆక్రమణలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ కోరుతోంది. లేదంటే భక్తి, చరిత్ర, గర్వానికి ప్రతీక అయిన ఓరుగల్లు కోట కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
కోట భూములు రక్షించండి
ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టండి
కలెక్టర్లకు లేఖలు రాసినా స్పందన లేదు
కోట భూములను ఏఎస్ ఐ పరిధిలోకి తీసుకురావాలి
కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ కోట భూముల ఆక్రమణలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు 2026 జనవరి 6న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆయన, కాకతీయుల కాలం నాటి అపురూప చారిత్రక వారసత్వాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్పష్టం చేశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖ (ఏఎస్ ఐ)కు చెందినవిగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో తక్షణమే మార్పులు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన వరంగల్ కోట చుట్టూ ఒకప్పుడు ఏడు ప్రాకారాలు ఉండేవని, ప్రస్తుతం అందులో కేవలం మూడు మాత్రమే మిగిలి ఉన్నాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రాకారాల భూముల్లో స్థానికులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడలు, రాతి గోడలను కూల్చివేస్తూ ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత శాఖలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
నోటీసులకే పరిమితమైన ఏఎస్ఐ చర్యలు
వరంగల్ కోట భూముల ఆక్రమణలపై గతంలో ఏఎస్ ఐ అధికారులు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 04-11-2022, 01-12-2025, 03-12-2025 తేదీల్లో కలెక్టర్‌కు లేఖలు ఇచ్చినా, ఆక్రమణల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై పురావస్తు శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ కోట భూములు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో “ప్రభుత్వ భూమి”గా నమోదై ఉండటం సమస్యలకు కారణమవుతోందని, వాటిని వెంటనే ఏఎస్ ఐ భూములుగా సవరించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకోసం భారత పురావస్తు శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ఈ ఆక్రమణల విషయం తన దృష్టికి వచ్చిందని, అప్పటి నుంచే ఈ అంశంపై ఆందోళనతో ఉన్నట్లు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు వరంగల్ కోట వంటి చారిత్రక కట్టడాలు అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.


