- రాజధానిలో రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుంది
- దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది..
- హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
- డీజిల్ బస్సుల స్థానంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే..
- నగరానికి బడ్జెట్లో ఏడాదికి రూ. 10 వేల కోట్లు..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. మంత్రి జూపల్లి..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అదే నిజమైతే హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ. 170 కోట్లు ఎలా పలికిందని ప్రశ్నించారు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన నెరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) 15వ సమావేశానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు.
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం..
హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చే క్రమంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువస్తున్నామని, భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామని బట్టి అన్నారు. ప్రతి సంవత్సరం నగర అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో రూ. 10వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాల్లో 20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఈ పనులతో హైదరాబాద్ రూపురేఖలను మారనున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మంత్రిని ఒప్పించి రక్షణశాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. షామీర్‌పేటలో 3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని వివరించారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందని అన్నారు.
వారిని దృష్టిలో పెట్టుకోవాలి
విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాల 25 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం, ఇందుకుగాను 11,500 కోట్ల బడ్జెట్ కేటాయించి పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచాం అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నేరెడ్కో ప్రతినిధులు CSR నిధులను విద్య, వైద్యరంగంపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయండి, ఖర్చు చేసిన నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా సర్టిఫికెట్లు పొందండి అని సూచించారు. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ రంగం కీలకం..
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ అభివృద్ధిలో రియలేస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని జూపల్లి వివరించారు.


