ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..!
గిరయ్యగుట్ట సర్పంచ్ ఆశావహుడి ఆఫర్ సంచలనం..
కాకతీయ, తెలంగాణ బ్యూరో :రంగారెడ్డి జిల్లా ఫరక్‌నగర్ మండలంలోని గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ ఎన్నికల హీట్ మొదలైంది. గ్రామ అభివృద్ధి పేరుతో సర్పంచ్ ఆశావహుడు పాత్లవత్ నూరియా నాయక్ చేసిన ఆఫర్ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని నూరియా నాయక్ ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. గిరయ్యగుట్ట తండా, నా గర్లగడ్డ తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన నూరియా నాయక్ మాటలు గ్రామంలో హాట్ టాపిక్‌గా మారాయి. సుమారు 550 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో రిజర్వేషన్ ఖరారవడంతో సర్పంచ్ పీఠం కోసం పోటీ వేడి పెరిగింది. అయితే నూరియా నాయక్ ప్రకటించిన రూ.25 లక్షల ఆఫర్‌పై గ్రామస్థులు ఎలా స్పందిస్తారో చూడాలి.


