కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధానికి స్వస్తి పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం తమను స్వర్గానికి తీసుకెళ్లే అవకాశం పెంచుతుందంటూ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ కామెడీ చేశారు. గతంలో యుద్ధం ముగింపుపై పలుమార్లు మాట్లాడిన ట్రంప్..నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నానంటూ చెప్పిన సంగతి తెలిసిందే.
మాస్కో కీవ్ మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేశారు ట్రంప్. ఈ రెండు దేశాల అధ్యక్షులతోపాటు యూరోపియన్ దేశాల నేతలతోనూ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రయత్నాలు కేవలం జీవితానికి సంబంధించినవి కావంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీటిని ప్రయత్నించి వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న ..నేను బాగా పనిచేయడం లేదని విన్నాను. ఒక వేళ నేను స్వర్గానికి వెళ్తే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుందని శాంతి ఒప్పందం ప్రయత్నాలను ఉద్దేశిస్తూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా విమర్శలు, అభియోగాలు, కోర్టు కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్..గతేడాది హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత తన ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు పలు సందర్భాల్లో దైవభక్తిని చాటుతున్న ట్రంప్..రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టేందుకు ఆ దేవుడే నన్ను కాపాడాడు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు వైట్ హౌస్ లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కూడా పెరిగినట్లు సమాచారం. దీనికోసం ఓ ఆధ్యాత్మిక గురువును సలహాదారునిగా నియమించుకోవడం గమనార్హం.


