- అందుకు బీజేపీయే పూర్తి బాధ్యత వహించాలి
- న్యాయం జరిగే వరకూ బీసీలంతా ఏకమై ఉద్యమించాలి
- మాజీ ఎంపీ వీ హనుమంతరావు పిలుపు
- హైదరాబాద్‌లో బీసీ సంఘాల నిరసన
కాకతీయ, తెలంగాణ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టేస్తే దానికి బీజేపీ పార్టీ బాధ్యత వహించాలని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఇరవై నెలలుగా బీసీ సమాజం ముక్తకంఠంతో కోరుతుంటే .. కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, దీనితో రిజర్వేషన్ వ్యతిరేకులు న్యాయస్థానాలను వేదికగా చేసుకొని బీసీల రిజర్వేషన్ల లకు గండి కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం పిలుపుమేరకు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
అందులో భాగంగా హైదరాబాదులోని అంబర్‌పేటలో ఉన్న జ్యోతిబాపూలే విగ్రహం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు పాల్గొన్నారు.హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లు కాపాడుకోవాలని న్యాయస్థానాలు బీసీలకు న్యాయం చేస్తాయని తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రేపు హైకోర్టులో జరిగే విచారణ కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ బీసీలంతా పార్టీలకతీతంగా ఏకమై ఉద్యమించాలని వీహెచ్ పిలుపునిచ్చారు.
ఆ పని ఎందుకు చేయడంలేదు..
బీసీ రిజర్వేషన్లు ఒక్క శాతం తగ్గినా రాష్ట్రం అగ్నిగుండగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీజేపీ రెండు నాలుకల విధానం వల్ల బీసీ రిజర్వేషన్లపై తమకున్న వ్యతిరేక భావనతోనే ఢిల్లీలో రాష్ట్రపతి గల్లీలో గవర్నర్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపడం లేదని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కనీసం గవర్నర్ కలిసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదముద్ర వేయించేవారని కానీ ఆ పని బిజెపి చేయడం లేదని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకు నిర్వహించామని ఇది బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనని, రాష్ట్రంలో ఒక్క శాతం తగ్గిన భవిష్యత్తులో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తీవ్రంగా హెచ్చరించారు.


