చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా
సర్పంచ్ అభ్యర్థిణి సంచలన బాండ్
కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల హామీలపై మాట నిలబెట్టుకోలేకపోతే చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తానంటూ సర్పంచ్ అభ్యర్థిని రాజేశ్వరి ఇచ్చిన బాండ్ స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రాజేశ్వరి గ్రామాభివృద్ధి హామీలను లిఖితపూర్వకంగా బాండ్‌పై రాసిచ్చారు. గ్రామానికి 12 పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానంటూ బాండ్ పేపర్లో గ్రామస్థులకు రాసిస్తున్నారు. ఈ పనులను మూడేళ్లలోనే పూర్తి చేస్తానని, చేయకపోతే పదవికి రాజీనామా చేసి గ్రామస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పుతానని బాండ్‌లో స్పష్టం చేశారు. మాట తప్పితే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకోవడమే కాదు.. గ్రామస్థుల చెప్పులు మెడకు వేసుకుంటానంటూ సంచలన వాగ్దానాలతో కూడిన బాండ్ పేపర్‌ను గ్రామస్థులకు అందజేస్తుండటం గమనార్హం.


