కాకతీయ, సినిమా: 2025 అక్టోబర్ 24: సినిమా ప్రపంచం అంటే మాంత్రిక అద్దం లాంటిది. ప్రేక్షకులు చూసేది అందం, కానీ ఆ అందం వెనుక ఉన్న త్యాగం, బాధ, మరియు మార్పులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు బ్యూటీ వరల్డ్‌లో ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఎందరో సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ ముఖం లేదా శరీరంలో లోపాలను సరిచేసుకుంటున్నారు. కొందరికి ఇది కంఫిడెన్స్ బూస్టర్‌గా, మరికొందరికి ఇమేజ్ మేకోవర్‌గా మారుతుంది. అయితే ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీల గురించి దాచిపెట్టేవారు, కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ కూడా చేరింది. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేసిన టాక్ షో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” లో పాల్గొన్న జాన్వీ కపూర్.. తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు కూడా పంచుకుంది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ వాదనలపై నేరుగా స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “అవును, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. కానీ అది నా తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలో జరిగింది. ఆమె సలహా, అనుభవం లేకుండా నేను ఆ నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. అమ్మ ఎప్పుడూ నా బలం. నా ప్రతి అడుగులో ఆమె ముద్ర ఉంటుంది. ఆమె నాకు తల్లిగానే కాకుండా మార్గదర్శకురాలిగా కూడా ఉంది.” అని ఓపెన్ కామెంట్స్ చేసింది. అయితే సోషల్ మీడియాలో చూసిన ప్రతి ట్రెండ్‌ని యువత బ్లైండ్‌గా ఫాలో అవ్వడం ప్రమాదకరమని జాన్వీ సూచించింది. తనకు ఏ సర్జరీలు జరిగాయో చెప్పనప్పటికీ.. ఇకపై ఓపెన్ బుక్‌లా ఉంటానని పేర్కొంది. తన జీవితంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ బహిరంగంగానే చెబుతానని తెలిపింది.
అదే విధంగా సోషల్ మీడియాలో తన రూపం, దుస్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లపై వస్తున్న విమర్శల గురించి కూడా జాన్వీ కపూర్ స్పష్టంగా మాట్లాడింది. “మన శరీరాన్ని మనం అంగీకరించడం ఎప్పుడూ సిగ్గు కాదు. సోషల్ మీడియా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలదు. కానీ మనం నిజాయితీగా ఉండటం ముఖ్యం. అందం అంటే కేవలం రూపం కాదు.. మన వైఖరే మనను అందంగా చూపుతుంది” అని జాన్వీ భావోద్వేగంగా పేర్కొంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ` పెద్ది` సినిమా చేస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. 2026 మార్చిలో పెద్దిని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


