సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు..
రేవంత్ అన్న సీఎం కావాలని నేనే కష్టపడ్డాను… మా మధ్య విభేదాలే లేవు..
ఎమ్మెల్సీ హామీ తప్పకుండా నెరవేరుతుంది.. విశ్వాసం వ్యక్తం చేసిన మురళీ..
కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ కాంగ్రెస్ నేత కొండా మురళీ, సుమంత్ వ్యవహారంపై మొదటిసారిగా స్పందించారు. హనుమకొండ రాంనగర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదని చెప్పారు. సుమంత్ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ చూస్తున్నా. కానీ నిజానిజాలు నాకు తెలియదు. నేను సురేఖ మంత్రి కార్యాలయానికి ఒక్కసారే వెళ్లాను. అక్కడ ఏమి జరుగుతుందో, ఎవరు వస్తారో నాకు తెలియదు అని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలపై నాకు తెలియదు అని మురళీ అన్నారు. రేవంత్ అన్న సీఎం కావాలని నేను, సురేఖ కలిసి ఎంతో కష్టపడ్డాం. వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత మరో వైఎస్ఆర్ లాంటి నాయకుడు రేవంత్ అన్న. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరు విభేదాలు సృష్టించినా, మాకు సంబంధం లేదు అని తెలిపారు.
రేవంత్‌పై విశ్వాసం..
ఎమ్మెల్సీ హామీపై నమ్మకం..
కొండా మురళీ మాట్లాడుతూ.. రేవంత్ అన్న ఇచ్చిన హామీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎమ్మెల్సీ ఇస్తానని అన్న మాట తప్పకుండా నెరవేరుతుంది. ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అబ్జర్వర్‌తో సమావేశం ఉంది. అక్కడ పరిస్థితులను తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటాను అని పేర్కొన్నారు.
సుస్మిత పరిస్థితిపై ఆవేదన..
కొండా సుస్మితతో ఇప్పుడే మాట్లాడాను. తాను ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆమెకు పూర్తి మద్దతు ఇస్తాము. అన్ని మంత్రులతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. అందుకే ఎవరి ఇంటికైనా వెళ్లి మాట్లాడగలను అని తెలిపారు. మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని, ఈ రోజు సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగే సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు క్లారిటీకి వస్తున్నాయి. పార్టీ లోపల జరుగుతున్న వాటిని అర్థం చేసుకొని తగిన సమయానికి స్పందిస్తాము అని కొండా మురళీ స్పష్టం చేశారు.


