నాకు మాయ మాటలు చెప్పడం రాదు
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ : తనకు మాయమాటలు చెప్పడం రాదని, ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే వ్యక్తిని కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని శాయంపేట హవేలీ,ఊకల్ హవేలీ,మరియాపురం, గంగాదేవిపల్లి,కొనాయిమాకు,ఎలుకుర్తి హవేలీ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వారిని పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయమే గ్రామాల అభివృద్ధికి దారితీస్తుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులను గెలుపులోకి తెచ్చాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మంచి పాలన, పారదర్శకత, ప్రజా సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే రేవూరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు, యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి..
ఆత్మకూరులో కేంద్రంలోని జీఎస్ఆర్ గార్డెన్లో ఆత్మకూరు, దామెర, నడికుడ మండలాల కాంగ్రెస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశంలో కూడా ఎమ్మెల్యే రేవూరి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని, గత రెండు సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని, అధికార పార్టీ సర్పంచులు గెలిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


