- రాష్ట్రంలో రాజకీయ శూన్యత
- జాగృతి వందశాతం రాజకీయ వేదికే
- జనంబాట తరువాతే రాజకీయ కార్యాచరణ
- ప్రతీ సమస్యపై పోరాడుతాం..ప్రజాగొంతుకగా మారుతాం..
- ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం, పార్టీలు
- జూబ్లీహీల్స్ ఎన్నికల్లో గెలుపోటములపైనే వారి శ్రద్ధ
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- కరీంనగర్‌లో రెండో రోజూ సాగిన జాగృతి జనంబాట
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ప్రజలను దగా చేశాయని, ప్రజా సమస్యల పై ప్రధాన పార్టీలు పోరాడటం మానేశాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా కరీంనగర్ జిల్లాలోరెండో రోజు శనివారం కవిత విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వీ పార్క్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ రాష్ట్రం లో రాజకీయ శూన్యత నెలకొందన్నారు. జనంబాట తర్వాత జాగృతి పూర్తి కార్యాచరణ వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ప్రజాగొంతుకగా మారుతామని, ఖచ్చితంగా..నూటికి నూరు పాళ్లు జాగృతి రాజకీయ వేదికేనని స్పష్టం చేశారు. తన వెనుక ఎవరూ లేరని, ఏ రాజకీయ శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు లేవని తెలిపారు.
నేను ప్రజా బాణాన్ని.
తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని.. తాను ప్రజలు వదిలిన బాణాన్ని అంటూ స్పష్టం చేశారు.
జాగృతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందని నేను ఏవరిని బాణం ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని అని కవిత స్పష్టం చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత భవిష్యత్తు కార్యచరణ ను ప్రకటిస్తామన్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ లో మరణాలపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వర్షిత విషయంలో నిజాలు పూర్తిగా వెలుగులోకి రావాలని అన్నారు. గత ఏడాదిన్నరలో 110 మంది విద్యార్థులు మరణించారని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రజలకు అందకపోవడం బాధాకరమని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం విద్యార్థుల చదువుకు ఆటంకమవుతోందన్నారు. ముఖ్యమంత్రి రూ. 700 కోట్లు విడుదల చేసినా ప్రతి నెలా నిధులు ఇవ్వాలనే హామీ నిలబెట్టుకోలేదన్నారు. పాఠశాలలు, కాలేజీలు మూసివేయకుండా పోరాటం చేస్తామని ఆమె తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీలు బిజి..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంపైనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ చేశాయని, వారికి ప్రజా సమస్యల కన్నా.. ఎన్నికల్లో గెలుపోటములే ముఖ్యమని కవిత విమర్శించారు. వరంగల్‌లో వరదలు, మొంథా తుఫాన్‌తో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిళ్లినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహరం చెల్లించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు లభించకపోవడం విచారకరం
మహిళలకు, బీసీలకు తగిన రిజర్వేషన్లు లభించకపోవడం విచారకరమని, వచ్చే మూడేళ్లలో నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ సాధనలో వెనుకడుగు వేయమని అన్నారు. సమసమాజం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోరాడలేదని విమర్శించారు. రైతు చట్టాలపై రాహుల్ గాంధీ మాట్లాడినా లేబర్ చట్టాలపై మౌనం పాటించారని ఆమె వ్యాఖ్యానించారు. కార్మికులకు న్యాయం జరగాలంటే సమష్టిగా ఉద్యమం చేయాల్సిందేనన్నారు.
గ్రానైట్ మాఫియాపై పోరాటం చేస్తా..!
కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందకపోవడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. వెయ్యి కోట్లు కేటాయించినా కరీంనగర్ ఇంకా పాత స్థితిలోనే ఉందన్నారు. డ్రైనేజీ లేకుండా మానేరులో మలినాలు పోస్తున్నారని అన్నారు. ఇది స్మార్ట్ సిటీనా ? అని ప్రశ్నించారు. కరీంనగర్-వేములవాడ రహదారి దుమ్ముతో నిండిపోవడాన్ని పెండింగ్ వంతెనలు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని గుర్తు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు ప్రజల సమస్యలపై స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ మాఫియా రాష్ట్ర సహజ వనరులను నాశనం చేస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లను దాటి తవ్వకాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఇప్పుడు నాకు ఎలాంటి బంధాలు లేవు గ్రానైట్ మాఫియాపై పోరాటం చేస్తానంటూ కవిత తెలిపారు. ఆర్టీసీ కార్మికులను చిన్న కారణాలకే తొలగించడం దారుణమని, 1100 మందిని తిరిగి పునరుద్ధరించాలని ఆమె కోరారు. కరీంనగర్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరమని గతంలో నిజామాబాద్‌లో 800 ఎకరాలు సేకరించి ప్రయత్నం చేశామని గుర్తు చేశారు.


