నేనే రాజు.. నేనే మంత్రి..
ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం
టెండర్లు లేకుండానే గోదావరిలో తవ్వకాలు
గిరిజన సొసైటీ పేరుతో అక్రమాల కవరింగ్
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన
ఎనిమిది నెలలు గడిచినా బదిలీ లేని అధికారి
మైనింగ్, విజిలెన్స్ మౌనంపై జనం నుంచి విమర్శలు
కాకతీయ, మణుగూరు : నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ఒక అధికారి ఇసుక మాఫియాతో చేతులు కలిపి గోదావరిలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి గిరిజన సొసైటీ పేరుతో భారీ దందా నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో డిషీల్టింగ్ పేరుతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి లారీల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. రాంనగర్, బట్టీలగుంపు, చిన్నరాయిగూడెం, అనంతారం, అన్నారం, గుండ్ల సింగారం, విజయనగరం గ్రామాల పేరుతో గిరిజన సొసైటీలు ఏర్పాటు చేసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల పేరును కవర్‌గా ఉపయోగించి వాస్తవానికి గుత్తేదారులతో కలిసి భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నేనే మంత్రి అంటూ దూకుడు..!
జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తూ నేను చెప్పిందే చట్టమంటూ వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ అండదండలతో అక్రమ మైనింగ్‌ను అడ్డగోలుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ఈ అధికారి ఎనిమిది నెలలుగా అదే స్థానంలో కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని ఆరోపణలు వచ్చినా బదిలీ లేకపోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.
నిబంధనల ప్రకారం గిరిజన సొసైటీలు లేబర్, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సేకరించి ఒకచోట నిల్వ చేయాలి. కానీ ఇక్కడ భారీ యంత్రాలతో గోదావరిలో లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. గిరిజనులకు ఉపాధి కల్పించాల్సింది పోయి వారి పేరుతో దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల మౌనం
మైనింగ్, విజిలెన్స్ శాఖలు స్పందించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు అంటున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించబడుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్, విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గోదావరి మరింతగా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


