నేను రైతు బిడ్డనే.. వారి కష్టాలేంటో నాకు తెలుసు
అన్నదాతలకు అండగా ఉంటా – మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నేను రైతు బిడ్డనే.. రైతుల కష్టాలేంటో నాకు బాగా తెలుసు.. అన్న దాతల కష్టాల్లో అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, రాజేశ్వరపురం గ్రామం లోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2025–26 సీజన్ చెరకు గానుగను సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కర్మాగార వ్యవస్థాపకులు నామ నాగేశ్వరరావు, చిన్నమ్మ దంపతులు ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని చెరకు గానుగ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన రైతులను నామా నాగేశ్వర్‌రావును వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు గురించి తీసుకున్నారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ కర్మాగారం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా భారీ నష్టాలు వస్తున్నప్పటికీ ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన వాడిగా రైతన్నలకు అండగా ఉంటూ రైతు శ్రేయస్సు దృష్ట్యా కర్మాగారాన్ని నడిపిస్తున్నామని అన్నారు. దేశంలోనే తొలి సారిగా రైతు సోదరుల కోరిక మేరకు టన్ను చెరుకు సరఫరా చేసిన రైతులకు అరకిలో పంచదార 2026-27 గానుగ సీజన్లో ఉచితంగా ఇస్తామని నామా ప్రకటించారు. కర్మాగారం అభివృద్ధికి మేనేజింగ్ డైరెక్టర్ నామ కృష్ణయ్య అహర్నిశలు కృషి చేస్తూన్నారని, భవిష్యత్తులో కూడా సిబ్బంది అంకిత భావంతో పని చేస్తూ ముందుకు సాగాలన్నారు.
కర్మాగారాన్ని నమ్ముకుని వేలాది మంది రైతులు..!
కర్మాగారాన్ని నమ్ముకొని దాని వెనుక వేలాది మంది రైతులు, వందలాది కుటుంబాల జీవనం ఉందని, అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలూ వచ్చినప్పటికీ నిబద్ధతతోనూ ఈ కర్మాగారాన్ని ముందుకు తీసుకుపోతున్నామని నామా స్పష్టం చేశారు. రైతు సోదరులందరూ చెరకు విరివిగా సాగు చేసి కర్మాగారం అభివృద్ధికి తోడ్పడటంతో పాటు రైతు సోదరులు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. రైతులు అభివృద్ధి తనకు ముఖ్యమని, రైతులతోనే కర్మాగారం ముందుకు సాగుతుందని నామ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ చెక్కర కర్మాగారం ఇవ్వని విధంగా టన్నుకు అత్యధిక మద్దతు ధర ఇవ్వడంతో పాటు, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీకి కంటే మధుకాన్ చెక్కర కర్మాగారం అధిక సబ్సిడీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో చెక్కర పరిశ్రమలు మూతబడుతున్నప్పటికీ తెలంగాణ బిడ్డగా చెరకు రైతుల సంక్షేమం కొరకు కర్మాగారాన్ని నడిపిస్తూ కృషి చేస్తున్న నామను రైతన్నలు పెద్ద ఎత్తున అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల చెరకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చెరకు గానుగ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కెన్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రావు, ఏవిపి వై. కోటయ్య, డీజీఎం కేన్ అప్పారావు, ఏజీఎం హెచ్ఆర్ నరేష్, విభాగాధిపతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుతో పాల్గొని కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.



