పశువులపై హైనా దాడి
మూడు లేగదూడలు, రెండు మేకలు మృతి
కాకతీయ,చిగురుమామిడి : హైనా దాడిలో పశువులు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన రైతు గండికోట పెద్దశ్రీనివాస్ వ్యవసాయ పొలం వద్ద షెడ్డులో ఉన్న మూడు లేగదూడలు, రెండు మేకలపై హైనా దాడి చేసి హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పశువులను పరిశీలించారు. అక్కడ ఉన్న అడుగులను పరిశీలించి ఇది హైనా దాడేనని నిర్ధారించారు. రైతులు పశువులను రక్షణగా ఇనుపకంచెల్లో ఉంచుకోవాలని సూచించారు. అడవి మృగాల దాడిలో మృతి చెందిన పశువులపై ఆర్థిక సాయం పొందేందుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మృతి చెందిన లేగదూడలు, మేకలతో సుమారు 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు గండికోట పెద్దశ్రీనివాస్ తెలిపారు. ఇటీవలే అప్పు చేసి కొనుగోలు చేసిన ఆవుల లేగదూడలు మృతి చెందడంతో తన పరిస్థితి మరింత దారుణంగా మారిందని వాపోయారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పాలకేంద్రం డైరెక్టర్ పెసరి శ్రీనివాస్, ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నునేగొప్పుల ఐలయ్య, గండికోట చిన్నశ్రీనివాస్, గండికోట వెంకటేష్, గండికోట అంజి తదితరులు కోరారు.


