కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమమని తెలిస్తే చాలు.. పంజా విసురుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలో చిన్న చెరువులో అక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ దాదాపు రెండున్నర ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. మట్టి నింపి..రహదారులు కూడా వేసింది. అయితే వీటన్నింటినీ హైడ్రా తొలగించేసింది.
చెరువులో నింపిన మట్టిని కూడా టిప్పర్లతో, జేసీబీలతో తొలగించింది. పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలో వేసింది. ఇదే సమయంలో పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ యజమానులపై కేసులు పెట్టారు. నెక్నాంపూర్ చిన్న చెరువు తొమ్మిది ఎకరాల మేర ఉండగా రెండున్నర ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. నెక్నాంపూర్ చిన్న చెరువు హైదరాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాలు, వరదల నివారణ, పర్యావరణ సమతుల్యత కీలకం. గతంలో కూడా ఈ ప్రాంతంలో భారీగా ఆక్రమణలు జరిగాయి.
నిజానికి ఈ ఆక్రమణలు తొలగించడం ఇది మొదటి సారి కాదు. ఇది నాలుగోసారి జరిగిన తొలగింపు. అనుమతులు రద్దు చేసినప్పటికీ నిర్మాణాలు కొనసాగాయి. 2024 మార్చిలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ మరియు ఆనంద హోమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటువంటి సంస్థల్లో ఇళ్లు కొనుగోలు చేసినట్లయితే.. వినియోగదారులు తర్వాత ఇబ్బందిపడే అవకాశం తప్పదు.


