- రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్..
- బసవతారకం ఆస్పత్రి సమీపంలో 5 ఎకరాల స్థలం కబ్జా
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు
- భూమి చుట్టూ ఫెన్సింగ్, బోర్డు ఏర్పాటు …
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారి భరతం పడుతోంది. ఈక్రమంలో తాజాగా బసవతారకం ఆస్పత్రి సమీపంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలని తొలగించింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేట్టారు. దీంతో ఇక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తనదే అని షెడ్లు నిర్మాణం
షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని బసవతారకం ఆసుపత్రి సమీపంలో ఉన్న 5 ఎకరాల స్థలంలో ప్రభుత్వం జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. ఈక్రమంలో పార్థసారథి అనే వ్యక్తి ఈ 1.20 ఎకరాలతోపాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదేనంటూ కోర్టుకెక్కాడు. అంతటితో ఆగక.. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టాడు. పైగా ఈ స్థలం మీద కోర్టులో వివాదం నడుస్తుండగానే.. ఈ మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్లు నిర్మించాడు.
ఆక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారణ
దీని గురించి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఇక్కడ ఉన్న ఆక్రమణలని తొలగించింది. ఈక్రమంలో రెవెన్యూ, జలమండలి అధికారులు పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టారు. విచారణలో.. 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. పార్థసారథి ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేశాడని తేలింది. అలానే ఈ 5 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసింది.


