కాకతీయ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతోంది. స్మగ్లర్లు ఎక్కడో చోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తున్నారు. భావితరాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వం ఎన్నిక అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినప్పటికీ మాదక ద్రవ్యాల వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాచకొండ కమిషనరేట్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు మహేశ్వరం వద్ద సంయుక్త దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.6 కోట్ల విలువైన గంజాయి ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించగా, కీలక నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల వెనుక ఉన్న ముఠా, రవాణా మార్గాలు, గంజాయి ఎక్కడి నుండి తెచ్చారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌తో రాచకొండ పోలీసులు మరోసారి మాదకద్రవ్యాల ముఠాలపై తమ కఠిన వైఖరిని స్పష్టం చేశారు.


