కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాకు చెందిన ప్రణిత శర్మ అనే మహిళ తన ప్రాణాలను తీసుకుంది. ఆమె భర్త అపూర్వ జ్యోతి శర్మ వృత్తిరీత్యా అడ్వకేట్ కాగా, కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.
అపూర్వ జ్యోతి శర్మ ఆరోగ్యం క్షీణించడంతో, ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయనను చేర్పించారు. అయితే చికిత్స సమయంలో వారు ఆస్పత్రి సమీపంలోనే ఉన్న ఒక హోటల్‌లో రూమ్ తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. భర్త ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ప్రణిత తీవ్రంగా మానసిక ఆందోళనకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హోటల్ గదిలోనే ప్రణిత తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బయటకు రావడంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రణిత శర్మ ఆత్మహత్యకు భర్త ఆరోగ్యం కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


